వారందరికీ 3 నెలల పింఛన్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో పింఛన్‌ పొందలేని వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మే నెలతో పాటు గత రెండు నెలలుగా పింఛన్ పొందలేని వారందరికీ జూన్ నెలలో మూడు నెలల పింఛన్ డబ్బు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు


ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గత రెండు నెలల్లో పింఛన్ డబ్బులు‌ తీసుకోని వారికి వచ్చే నెలలో మొత్తం 3 నెలలకు సంబంధించిన చెల్లింపులు చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న పింఛన్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికి పింఛన్‌ డబ్బులు అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.

కాగా, కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలోనూ ఏపీ ప్రభుత్వం ఒక్కరోజులోనే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 90 శాతం మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి పింఛన్ సొమ్మును వారి చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్లు విజయవంతంగా పూర్తి చేశారు.